Thursday, December 5, 2013

నెట్ నేస్తం...

ఈ రోజు ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమైన నా వ్యాసం.

           
  మా అబ్బాయికి ఆరేండ్లే అయినా కంప్యూటర్ ఆవులిస్తే చాలు పేగులు లెక్కపెడతాడు అని మురిసిపోతారు కొందరు తల్లిదండ్రులు.మా అమ్మాయికి ల్యాప్ టాప్ వుంటే చాలు ఇల్లు దాటదు.తమ కనుసన్నలలోనే ఉన్న పాపాయి తమ నీడలో క్షేమంగా ఉందనుకుంటారు అమ్మానాన్నలు.నిజమే! కంప్యూటర్ వచ్చాక కలానికి,కాగితానికి విశ్రాంతి పలికింది.అన్నీ ఆన్ లైన్ లోనే! ఎన్నోవిషయాలను,విశేషాలను అడగడం ఆలస్యం అడిగినవి,అడగనివి కూడా మనముందుకు తెస్తుంది.పాఠ్యాంశాలు పెరిగేకొలది డిక్షనరీ,వికిపీడియా,కంప్యూటరు సంబంధిత పాఠాలు వంటివెన్నోతమ పిల్లలు వినియోగిస్తూ పదుగురితో చర్చిస్తుంటే ఆ ఇంటి పెద్దలు ఆశ్చర్యపోతూ సంబరపడిపోతారు. విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానం ఈ నాటి పిల్లలకు అందుబాటులోకి రావడం మంచిదే.అయితే ఆ మంచిని మించి  మనిషిని నిలువునా ముంచే వలలో,అదేనండి  నెట్లో  అదే పనిగా చిక్కుకుంటే చిక్కుముళ్లు పడినట్లే!
               తల్లిదండ్రులకు తమ పిల్లల చదువుకు దోహదపడేందుకు తాహతుకు మించినదైనాసరే కావలసిన డెస్క్ టాప్,ల్యాప్ టాప్,ఐప్యాడ్ వంటివి కొనిస్తారు.తమ అవసరాలను సైతం వాయిదా వేసుకుంటారు.విషయ సముపార్జనకు నెట్ కనెక్షన్ తప్పనిసరి.కాని నెట్ బ్రౌజింగ్ ఒక వ్యసనంగా మారితే మాత్రం ప్రమాదమే!మానసిక వైద్యంలో నిత్య చర్చావేదిక ఈ నెట్ అడిక్షన్.అసలు ఇంటర్నెట్ ఎలా వాడాలో తెలియని వారు  కడకు దానికే అంకితమై ఆ వలలో పూర్తిగా ఇరుక్కుపోవడం లక్ష్యసాధనలో పెద్ద అవరోధం.తత్ఫలితంగా చదువు,పరీక్షలు అంటే విముఖత,నలుగురిలో కూర్చుని మాట్లాడాలంటే నిరాసక్తత పెరుగుతాయి.సామాజిక వెబ్ సైట్లపై ఉండే ఆసక్తి,కుటుంబసభ్యుల విషయంలో ఉండకపోవడం మొదలై,ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నా పెద్దలు గమనించలేకపోవడం దురదృష్టకరం.
              సమాచార సేకరణ జీవితానికి బంగారు బాట వేయడానికి మైలురాయిగా ఉపయోగపడాలి కాని అవాంఛనీయ విషయానురక్తి బ్రతుకు చిత్రాన్ని చిధ్రం చేస్తోంది.సామాజిక సైట్లలో అనుభవాలు,అనుభూతులు పంచుకోవడంలో నియంత్రణ ఉండాలి.నిద్రలేమి లేదా అతినిద్ర,చిరాకు,విసుగు,బద్ధకం,తిండి మానేయడం లేకుంటే అదే పనిగా తినడం వంటివి శారీరక రుగ్మతలుగా అనిపించినా, మానసిక వికారాలు పెంచే వల వ్యామోహానికి పిల్లలను దూరంగా ఉంచడమే మేలు.
                      ఇక కాస్త పెరిగిన యువతీ యువకులకు మంచి పనే చేస్తున్నాం,కనీసం ఇలా అయినా స్నేహాలు పెరుగుతున్నాయి కదా అనిపించడంలో ఆశ్చర్యపడనవసరం లేదు .కాని వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడం,తీసిన లేదా తీసుకున్న ప్రతి ఫోటోను అప్పటికప్పుడు అప్ లోడ్ చేసెయ్యడం,అందరితో పాస్ వర్డ్ షేర్ చేసుకోవడం వంటివి కూడదని హెచ్చరించవలసిన బాధ్యత పెద్దలదే.ఫోనైనా,కంప్యూటరైనా కనబడ్డ ప్రతి సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడు చేసెయ్యడం,ప్రతి కొత్త యాప్ ను వాడాలనుకోవడంలో కాస్త తరచి చూచి అడుగెయ్యాలి.లేదంటే వైరస్ బారిన పడి మన సమయాన్ని,ఢబ్బును వృధాపరుస్తాయి.

 ఈ నేపథ్యంలో పిల్లలేం చేస్తున్నారో పెద్దలు తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.మీకు తెలియదు,మీకు రాదు,మీకర్థం కాదు అని పెద్దవాళ్లు దగ్గరికొస్తే తరిమేస్తూ, కంప్యూటరు కిటికీలను మూసేసారంటే తస్మాత్ జాగ్రత్త అనక తప్పదు. విషయ అవగాహన పెంచుకుంటున్నామన్న మిషతో  వలలో పడితే మాత్రం అది మనిషిని సైతం పతనమనే వైరస్ కు బలి చేస్తుంది.
   

  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

0 comments:

Post a Comment