Sunday, April 22, 2012

పండుటాకులు కాదు పసిడిపత్రాలు



22-4-12 ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించబడిన నా  సమీక్ష.
   http://www.andhrabhoomi.net/content/pandu                 
ఐతా చంద్రయ్యగారు కథ,కవిత,నవల,నాటిక,సమీక్ష,అనువాదం తదితర ప్రక్రియలన్నింటిలోను తన రచనాశక్తిని,రచనాసక్తిని ప్రస్ఫుటింప చేసిన రచయిత.వారి నవల సంధ్యావందనము వృద్ధుల చేదు అనుభవాల సమాహారం.ఆనందనందనమను వృద్ధాశ్రమము వారి కథలను కలబోసుకునే వేదిక. పెరుగుతున్న వయోభారము, తరుగుతున్న జీవన విలువలే అన్నికథనాలకు మూలసూత్రము.
          ఆశ్రమవాసి సోమనాథ్ కు రావలసిన పెన్షన్ మంజూరు ఆలస్యమైనపుడు అతడి రిక్త హస్తానికి సరైన భోజనం పెట్టడానికి కూడా కోడళ్లిద్దరు ఇష్టపడరు.అదే అతడి గ్రాట్యుటీ రాగానే తమ పిల్లల పెళ్లిళ్లకు,చదువులకు ఉపయోగపడాలంటూ సోమనాథ్ ను మాటలతో మభ్యపెట్టి వారి పిల్లలపేర డిపాజిట్లు చేయించుకుంటారు. తల్లిదండ్రులను అవకాశవాదంతో లోబరచుకుని మళ్లీ ముఖం చాటేసే సుపుత్రులకు కొదవలేని భారతావనిలో భార్య మరణానంతరం ఆశ్రమంలో సేదతీరే ఇలాంటి  సోమనాథ్ లెందరో!ఇదే తీరున ఆనందనందనాన్ని చేరుకున్న రచయిత అయిన కబీరుదాసు మంచి పాటకారి కూడా!రచయిత అతని ద్వారా పాటలచరణాలను పలికించి, జీవితబాటలోని ఒడిదుడుకులకు అన్వయించడం చక్కటి ప్రయోగమే!         
          ఇక ఆశ్రమ ట్రస్టు కార్యదర్శి లాయర్ కమలాకర్ ఆశ్రమ నిర్వహణలో  చూపించే శ్రద్ధ వృద్ధులను అలరిస్తుంది. వారికి ఆటలపోటీలు,సమాజహిత కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారి మనసులకు చల్లని లేపనంవలె సేదతీర్చడం వారి కడగండ్లను మరిపిస్తుంది.ఇంత చక్కటి వాతావరణం ప్రాప్తించినపుడు, వానప్రస్థాశ్రమానికి ఇంతకంటె ఏంకావాలి అనిపించకమానదు.ఈ ఆశ్రమం నీడను చేరిన  జగదాంబ, అన్నపూర్ణ,జగదీష్,ఆనందరావు మొదలైన వారి అనుభవాల పుటలన్నీ అక్షరభాష్పాలే! వైద్య సదుపాయం, ఆరోగ్యకర ఆహారం,వెచ్చటి పరామర్శ! వృద్ధుల కనీస అవసరాలు.ఇవి కూడా అందించలేని సంతానం ఆడే యూజ్ అండ్ త్రో ఆటలో పావులైన మరెందరినో అక్కున చేర్చుకుంటుంది ఆనందనందనం. కారణాలు,సందర్భాలు వేరైనా వారి సంఘర్షణలో, ఆవేదనలో సారూప్యం వారి బాటను ఏకం చేసింది. మాట్లాడేందుకు ఎవరు లేరే అని నిట్టూర్చే వారందరు వారి రాకకు గల బలమైన కారణాలను వివరించడంలో రచయిత వెదజల్లిన పాతపాటల పరిమళం, తిరగేసిన చరిత్రపుటలు,అలరించిన ఆధ్యాత్మిక భావనా వీచికలు నవల నడకకు మెరుగులు దిద్దాయి. కార్యదర్శి కమలాకర్ తన కొడుకనే నిజాన్ని కబీర్ దాస్ వెల్లడి చేయడం నవలలో నాటకీయమైన కొసమెరుపు.     
           అయోమయం చౌరస్తాలో బిక్కుబిక్కుమంటూ నుంచున్న సీనియర్ సిటిజన్స్ కు సచ్చిదానందనిలయంగా ఆనందనందనాన్ని రచయిత అభివర్ణించడం అక్షరసత్యం.నేడు ప్రపంచీకరణ నేపథ్యంలో ఆప్యాయతలు, అనుబంధాలు  మరుగై ఎవరికివారే యమునాతీరే అనే పాశ్చాత్య సంస్కృతి ప్రబలమవడమే ఇలాంటి ఆశ్రమాలు, ఆశ్రయాలుగా మారడానికి కారణమంటారు రచయిత.రక్తం పంచుకు పుట్టిన పిల్లల వింత ప్రవర్తనకు,విపరీత బుద్ధికి తట్టుకోలేక ఆనందనందనం చేరి తాము పడ్డ మానసిక శ్రమనువీడి ఆనందంగా జీవించగలుగుతున్నారు అని తన నవల ద్వారా చెప్పడంలో ఐతా చంద్రయ్యగారు సఫలీకృతులయారనే చెప్పాలి.                                                                                                                                                                                                                                                    
పుస్తకం దొరకు చోటు
ఐతా చంద్రయ్య
ఇ.నెం.4-4-11,షేర్ పురా,సిద్ధిపేట్-502 103
మెదక్ జిల్లా,(ఆ.ప్ర)
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,హైదరాబాద్
సాహిత్యనికేతన్, హైదరాబాద్
ప్రజాశక్తి బుక్ హౌస్, హైదరాబాద్
 (ఆంధ్రభూమి సౌజన్యంతో )








  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

0 comments:

Post a Comment